న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
నవాబుపేట: ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిప్రియ సూచించారు. గురువారం ఆమె మండల కేంద్రంతోపాటు లింగంపల్లిలో పర్యటించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఫారమ్స్ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నవారికి అధికారులు అవగాహన కల్పించి ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. అలాగే మండల అధికారులు, పర్యవేక్షణ విధిగా చేయాలన్నారు. రోజువారీ ప్రక్రియను జిల్లా అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కాస్తా ఆలస్యంగా సాగుతుందని దీన్ని వేగవంతం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ విధులపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సురేష్, మండల, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు.
మొదటిరోజు
నామినేషన్లు నిల్
అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2872
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,872, కనిష్టంగా రూ.1,839 ధరలు లభించాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,453, కనిష్టంగా రూ.1,988, వేరుశనగ రూ.3,329 ధరలు పలికాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని మార్కెట్‌కు గురువారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,542, కనిష్టంగా రూ. 3,110, సరాసరి రూ. 6,050 ధరలు పలికాయి. అలాగే 13 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటాకు రూ.1,809, కందులు రూ.6,389 ధర పలికింది.
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): దున్నిన దుక్కుల్లో విత్తులు పెట్టాల్సిన రైతులు వాన లేక నెల రోజులుగా ఆకాశానికేసి చూస్తున్నారు. రోహిణి కార్తె చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిపించకుండానే వెళ్లిపోయింది. తర్వాత మృగశిర కార్తె వచ్చినా వాన జాడే లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సీజన్‌లో జిల్లాలో 4,05,236 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. జూన్ ముగిసే నాటికి 99,440 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. లక్ష్య సాగుతో పోలిస్తే ఇది 24 శాతానికి కూడా చేరలేదు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం పంటల సాగు చేస్తుంటారు. ఇందులో వరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సీజన్‌లో 2.40 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 12,954 ఎకరాల్లో మాత్రమే నారుమడులు సిద్ధమయ్యాయి. అదీ ఎక్కువగా బోర్లు, భూగర్భజలాల ఆధారంగా రైతులు నార్లు పోసిన ప్రాంతాలే. తదుపరి వర్షాలు లేకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు.
● పత్తి సాగు కొంతమేర ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఈసారి 95 వేల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 67,025 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇటీవల ఎండల తీవ్రతతో మొలక దశలో ఉన్న పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలో జిల్లాలో సగటు వర్షపాతం సాధారణస్థాయిలో నమోదైనప్పటికీ మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉంది. పది మండలాల్లో జూన్ మాసంలో వర్షం లోటు కనిపించింది. జూలై మాసంలో కురిస్తే వర్షాలపైనే ఈ ఏడాది సాగు భవిష్యత్ ఆధారపడి ఉంది. నవాబుపేట, బాలానగర్, దేవరకద్ర, మహమ్మదాబాద్ వంటి మండలాల్లో అధిక వర్షపాతం నమోదవ్వగా.. చిన్నచింతకుంట, హన్వాడ, మూసాపేట, కోయిలకొండ, అడ్డాకుల, మహబూబ్‌నగర్ రూరల్, అర్బన్, కౌకుంట్ల మండలాల్లో వర్షం లోటు కనిపిస్తోంది. ఈ ప్రభావం నేరుగా పంటల సాగుపై పడింది.
ఆరుతడి పంటల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం వంటి పంటలు విత్తేందుకు కనీసం 60–75 మిల్లీమీటర్లకు పైగా వర్షం అవసరమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట విత్తనాలు వేసిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావంతో అవి సరిగా మొలకెత్తకపోవడంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది. సాధారణంగా జూన్ చివరి నాటికి చల్లటి గాలులతో కూడిన వర్షాలు కురవాల్సి ఉండగా, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఎండ వేడి, ఉక్కపోత, వడగాలులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కార్తెలు మారినా కరుణించని వరుణుడు
ఎవుసం సాగక దిగాలు పడుతున్న అన్నదాతలు
ఎండుతున్న నారుమడులు.. మొలకెత్తని పత్తి గింజలు
చినుకు జాడకు రైతుల ఎదురుచూపులు
లక్ష్యానికి చాలా దూరంలో
పంటల సాగు విస్తీర్ణం
జూలై నెల లో కురిసే వర్షాలపైనే ఆశలు


