గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్‌లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మరమ్మతు కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది.
లోపభూయిష్ట నిర్మాణంతో..
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించి.. మరమ్మతులు చేపట్టాలని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్‌సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు.
మట్టి నమూనా సేకరణ..
గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్‌ఈఆర్‌ఎల్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు పంపించి.. ఆనకట్టలోని రాక్‌టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్‌కు మరమ్మతు చేపట్టనున్నారు.
ఎట్టకేలకు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు
సివిల్ గ్రౌండింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు
ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ


