మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్‌ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్‌ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గులాం దస్తగీర్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, వాలీబాల్ అకాడమీ కోచ్‌లు పర్వేజ్‌పాష, అబ్దుల్ రహెమాన్‌ఖాన్, ఇతర కోచ్‌లు సునీల్‌కుమార్, సయ్యద్ అంజద్, రాజగోపాల్, వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాల నుంచి 95 మందిబాలబాలికలు హాజరు


