జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని తప్పులు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీహాల్‌లో జిల్లాస్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి తప్పనిసరిగా బూత్ లెవల్ ఏజెంట్లు నియమించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు ఓటర్ల నుంచి పూర్తి వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తున్నారని వివరించారు. పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను నింపేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులను గుర్తిస్తే వాటిని వెంటనే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓలు) లేదా సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఏఈఆర్‌ఓలు) దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


