కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్‌తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్‌డీజీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


