మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మిడ్జిల్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మండలకేంద్రంలో జిల్లాస్థాయి అధికారులతో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. బహిరంగసభ, విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్రతి అధికారి చేపట్టాల్సిన బాధ్యతల గురించి అదనపు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ అధికారులు హెలిప్యాడ్, సభ ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులు వేదిక, గ్యాలరీలు, వీఐపీ వాహనాల ప్రవేశ మార్గం, ప్రజల రాకపోకలకు సంబంధించిన అన్ని పనులు పకడ్బందీగా చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ అఽధికారులు విగ్రహాల ప్రతిష్ఠ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, తహసీల్దార్, మున్సిపాల్ అధికారులు తాగునీరు, గ్రీన్‌రూమ్‌ల ఏర్పాట్లు, మరుగుదొడ్ల, పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సభ ప్రాంగణం, పార్కింగ్ దగ్గర లైట్ల ఏర్పాటు, ఆరోగ్యశాఖ అత్యవసర వైద్య సేవలకు కావాల్సిన సౌకర్యాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, ఆర్‌డీఓ నవీన్, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


