మద్దూర్ (కోస్గి): భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకోగా మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్ పరిధిలో బుధవారం చోటు చేసు కుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన ఖాజాబీ (26)కి కుటుంబ విషయంలో భర్త యూసుఫ్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు భార్యభర్తలు గొడవపడ్డారు. భర్త వ్యాపారం నిమిత్తం కోస్గికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖాజాబీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం ఇచ్చారు. వివాహిత ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో
బలవన్మరణం
వీపనగండ్ల: మండలంలోని కల్వరాల్ల గ్రామానికి చెందిన బండారు గోవిందు (26) అనే యువకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ మాజీ సర్పంచ్ బండారు శంకరమ్మ కుమారుడైన ఇతను రోజు నూతనంగా నిర్మించిన గృహంలో నిద్రించేవాడు. అవివాహితుడైన ఇతడు మంగళవారం రాత్రి కూడా పడుకోవడానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి హుస్సేన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
రెండు బైక్‌లు ఢీ..
యువకుడు మృతి
జడ్చర్ల: ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఖాదర్ కథనం మేరకు.. నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(30) బైక్‌పై జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రశేఖర్, మరో బైక్ మీద ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన వినయ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో జడ్చర్ల పర్యటనకు వస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రమాద స్థలం వద్ద ఆగి క్షతగాత్రులను ఆటోలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
మల్దకల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘ టన మండలంలోని అమ రవాయి గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసు కుంది. పూర్తి వివరాలు.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన కుర్వ రవి(32) బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమరవాయి వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. ఇదే సమయంలో ట్రాక్టర్ వెళ్తుండగా రవి తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుక్కను తప్పించబోయి..
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన వర్షిత్(17), అతడి మిత్రుడు జహంగీర్‌తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై గంగాపూర్ నుంచి జడ్చర్ల కొత్తబస్టాండ్‌కు మరో మిత్రుడిని రిసీవ్ చేసుకోవాడానికి వెళ్తుండగా జడ్చర్లలో ఎంబీ చర్చీ వద్ద కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో వెనుక కూర్చున్న వర్షిత్, బైక్ నడుపుతున్న జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వర్షిత్ మృతి చెందాడు. మృతుడి తల్లి సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పోలీసుల అదుపులో
గంజాయి బాధితుడు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో బుధవారం సాయంత్రం పోలీసులు విస్తతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక షేరేలీవీధికి చెందిన బషీర్ అను యువకుడు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను, ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. మత్తు పదార్థాలతో జీవితం నాశనం అవుతుందని, ఎవరైనా మత్తు పదార్ధాలు తీసుకున్నా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


