డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

Jul 2 2026 2:47 AM | Updated on Jul 2 2026 2:47 AM

గోపాల్‌పేట: అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో ఎస్‌ఐ శశిధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్‌ ఏఎస్‌ఐ కేసు నమోదు చేశారు. ఈ ఘటన గోపాల్‌పేట మండలంలోని మున్ననూరు, తిర్మలాపూర్‌ శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్ననూరు గ్రామానికి చెందిన రైతులు పందెం కృష్ణారెడ్డి, పందెం రవిచంద్రనాథ్‌రెడ్డి పొలంలో రాళ్లు పేల్చి భూమిని చదును చేసేందుకు మండ్ల కురుమూర్తి కంప్రెషర్‌ పెట్టి పేలుడు పదార్థాలు వినియోగించి భూమిని చదును చేద్దామనుకున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంప్రెషర్‌ ఓనర్‌ మండ్ల కురుమూర్తి నుంచి 83 జిలెటిన్‌ స్టిక్స్‌, 20 డిటోనేటర్లు, వంద మీటర్ల కార్డెక్స్‌ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గోపాల్‌పేట ఎస్‌ఐ శశిధర్‌ ఫిర్యాదు మేరకు ఉమెన్‌ ఏఎస్‌ఐ రమామణి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

పెరిగిన ఉల్లి ధరలు

దేవరకద్ర: సీజన్‌ ప్రారంభంలో తక్కువ పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు భారీగా ఎగ బాకుతున్నాయి. మే నెల వరకు రూ.వేయి నుంచి రూ.1,200 వరకు క్వింటా ఉన్న ఉల్లి ధర జూన్‌ ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తోంది. మూడు వారాల క్రితం రూ.1,600 ఉండగా.. బుధవారం జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.1,200 వరకు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాలకు పైగా వచ్చిన ఉల్లిని వేలం తరువాత తూకాలు వేసి విక్రయించారు. 50 కేజీల నాణ్యమైన ఉల్లి ధర రూ.1,350 వరకు విక్రయించారు. మధ్యస్తంగా ఉన్న ఉల్లిని బస్తా రూ.1,200 నుంచి రూ.800 వరకు బస్తాగా విక్రయాలు సాగాయి.

ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.2,771

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం క్వింటా గరిష్టంగా రూ.2,771, కనిష్టంగా రూ.2,589, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,447, కనిష్టంగా రూ.2,121, ఆముదాలు రూ.6,386, పొద్దుతిరుగుడుకు రూ.5,526 ధరలు లభించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement