అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జోగుళాంబ సన్నిధిలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అలాగే యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. గురువారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


