అరకొరగా అద్దె వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

అరకొరగా అద్దె వసూళ్లు

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండు ప్రాంగణంలో ఉన్న దుకాణాల నుంచి ప్రతినెలా అద్దె పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదు. వేల పాటల సమయంలో వ్యాపారులు పోటాపోటీగా పాల్గొని ఎక్కువ ధరకు దక్కించుకుంటున్నారు. ఆ తర్వాత సరిగా వ్యాపారాలు నడవడం లేదని అద్దె చెల్లింపును వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు దుకాణాలను మూసివేయడంతో చివరకు డిపాజిట్‌ నుంచి అద్దె బకాయిలను ఆర్టీసీ అధికారులు రాబడుతున్నారు.

● మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ కొత్త బస్టాండు ప్రాంగణంలో మొదట 1990లో 19 దుకాణాలు, మరొకటి హోటల్‌/క్యాంటీన్‌ నిర్మించారు. ఏడాది తర్వాత వీటికి వేలం పాటలు నిర్వహించారు. అక్కడ గిరాకీ బాగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లో పోటాపోటీగా వ్యాపారులు పాల్గొని ఆయా దుకాణాలను అధిక ధరకు దక్కించుకున్నారు. వీటిలో నెలసరి అద్దె కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్నాయి. ఇక హోటల్‌/క్యాంటీన్‌కు మాత్రం రూ.ఆరు లక్షలకు ఖరారైంది. పదేళ్ల పాటు వివిధ వ్యాపారాలు ఆశించిన విధంగా నడిచింది. ఆ తర్వాత నగరం వేగంగా విస్తరిస్తుండటంతో న్యూటౌన్‌, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ, శ్రీనివాస కాలనీ, ఏనుగొండ వరకు వందలాది ప్రైవేట్‌ వ్యాపార సముదాయాలు వెలియడంతో పాటు స్టాండుకు ఎదురుగా ఉన్న కలెక్టరేట్‌ పాలకొండ శివారుకు తరలిపోయింది. దీంతో కొత్తబస్టాండులోని షాపులలో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే 8 షాపులు మూతపడ్డాయి. ఇక కాలక్రమేణా అటు.. ఇటు ప్లాట్‌ఫాంల మధ్యన మరో ఏడు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. వీటికి కనిష్టంగా రూ.45 వేల నుంచి గరిష్టంగా రూ.రెండు లక్షల వరకు అద్దెలు వస్తున్నాయి. అలాగే ఏడాదిన్నర క్రితమే ఎన్‌హెచ్‌–167 వెంట (మెయిన్‌ రోడ్డు) కొత్తగా మొదటి బ్లాక్‌లో పది, రెండో బ్లాక్‌లో ఏడు, మూడో బ్లాక్‌లో మూడు ఇలా 20 దుకాణాలు నిర్మించారు. ఆ వెంటనే వేలం పాటలు నిర్వహించగా కేవలం మూడు షాపులు మాత్రమే తీసుకోవడానికి ఇద్దరు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఇందులో ఒకరు మొబైల్‌ షాపు ఏర్పాటు చేసుకున్నా పదుల సంఖ్యలో తోపుడుబండ్లు అడ్డంగా ఉండటంతో గిరాకీ లేక మూడు నెలలకే మూసేశారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ హోటల్‌ యాజమాన్యం ఇక్కడి రెండు, మూడు బ్లాక్‌లలోని పది దుకాణాలను ఏకమొత్తంగా నెలసరి అద్దె రూ.8.5 లక్షలకు తీసుకున్నా ఇంకా ప్రారంభించలేదు. ఇదిలాఉండగా వచ్చే నెలలో ఖాళీగా ఉన్న దుకాణాల కోసం మరోసారి వేలం పాటలు నిర్వహించనున్నారు. కాగా, ఆయా దుకాణదారుల నుంచి అద్దె వసూలుకు ఆర్టీసీ అధికారులు ఏడుగురితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతినెలా 5 తేదీలోగా వారి నుంచి రావాల్సి ఉన్నా కొందరు గడువులోగా చెల్లించకపోవడంతో ప్రత్యేక బృందం నోటీసులు జారీ చేసి ఎలాగోలా 32 దుకాణాల నుంచి రూ.24 లక్షలకు గాను రూ.14 లక్షలు (58 శాతం) రాబట్టగలిగారు.

పాలమూరు బస్టాండ్‌లో క్యాంటీన్‌ సహా 47 దుకాణాలు

కొన్నేళ్లుగా ఖాళీగానే ఆర్టీసీ 15 పాత, కొత్త దుకాణాలు

వ్యాపారాలు సరిగా నడవక మధ్యలోనే మూసివేస్తున్న తీరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement