విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

ఉపాధ్యాయులు సమయపాలనపాటించాలి

నాణ్యమైన బోధన అందించాలి: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): విద్యార్థులు నమోదు, హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలిని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఈఓ ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, నిర్దేశిత టైమ్‌ టేబుల్‌ ప్రకారం తరగతి గదులకు సకాలంలో హాజరై నాణ్యమైన బోధన అందించాలని ఆదేశించారు. పాఠశాల పనివేళల్లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో నైట్‌ డ్యూటీ పూర్తి చేసిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి బోధనకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదు లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్ని ఎంఈఓలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆధార్‌ వివరాలు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న డ్రాప్‌బాక్స్‌ విద్యార్థులందరికీ వెంటనే ప్రవేశాలు కల్పించాలని సూచించారు. సీసీ కుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరచాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించారు. ప్రతి ఎంఈఓ నెలకు కనీసం 16 పాఠశాలలను, ప్రతి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు కనీసం 12 పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలన్నారు. యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచకుండా వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్‌ సాయిశివాని, డీఈఓ విజయకుమారి, ఏఎంఓ శ్రీనివాస్‌, సీఎంఓ సుధాకర్‌ రెడ్డి, జీఈసీఓ అస్రాఖాద్రీ, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ ప్రశాంత్‌, పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement