కొత్తకోట రూరల్: రైతులు భూసార పరీక్షలు చేయించుకొని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపడితే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందొచ్చని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమడబాకుల రైతువేదికలో భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సాగు భూముల్లో సేంద్రియ కార్బన్, నత్రజని, జింక్, బొరాన్, సల్ఫర్ వంటి పోషకాల లోపాలు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. భూమి సారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రియ, పచ్చిరొట్టె, జీవన ఎరువులను సమపాళ్లలో వాడాలని సూచించారు.
ప్రకృతి వ్యయసాయంతో మేలు
రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ విధానాలను అవలంబించడం ద్వారా పంట పెట్టుబడిని తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ ఆత్మ (ఏటీఎం) డిప్యూటీ డైరెక్టర్ హైమావతి సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందన్నారు. పంట కోత అనంతరం పంట అవశేషాలను కాల్చివేయకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా మార్చుకొని వినియోగించే పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ రవీందర్‌రెడ్డి, రైతులు భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, శేఖర్, అబ్దుల్లా, వెంకటయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


