మహబూబ్‌నగర్ క్రైం: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నైట్రేట్ మిశ్రమం ఏర్పాటు చేసి పేల్చడానికి ప్రయత్నించిన ఇద్దరూ వ్యక్తులను కోయిలకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ నాగరాజు మాట్లాడుతూ.. కోయిలకొండ మండలంలో అంకిళ్ల వాగు వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం గుంతలు తీసి నైట్రేట్ మిశ్రమం (పూసలు) ద్వారా పేల్చడానికి ప్రయత్నం చేసిన నితిన్‌రెడ్డి, ఉదయ్‌కిరణ్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరు ఎలాంటి పోలీస్, సంబంధిత శాఖల అనుమతి తీసుకోకుండా అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం వద్ద గుంతల్లో నైట్రేట్ మిశ్రమం ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. దీంతో మహబూబ్‌నగర్ నుంచి బాంబ్ స్క్వాడ్ రప్పించి నైట్రేట్ మిశ్రమం నిర్వీర్యం చేశామన్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలు వాడుతున్న సమయంలో ముందుస్తు అనుమతులు, కావాల్సిన రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పేల్చడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇలా చేస్తే సమీపంలో ఉన్న వారికి కూడా ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. ఈ ఇద్దరిపై ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


