మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు సాగు పెట్టుబడికి ఊతమివ్వాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం జిల్లాలో ప్రారంభం నుంచే సందిగ్ధ పరిస్థితులకు దారి తీస్తోంది. 2026–27 వానాకాలం సీజన్‌కు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకే పరిమితం చేయడం సాగుదారుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. మిగిలిన భూమి విస్తీర్ణానికి పూర్తిస్థాయిలో నిధులు వస్తాయా? లేక కోతలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందని పరిస్థితుల్లో.. వానాకాలం నిధులు విడుదల కావడం మరింత అయోమయానికి దారితీస్తోంది. జిల్లాలో రైతు భరోసా అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● జిల్లాలో వానాకాలం రైతు భరోసా కోసం మొత్తం 2,63,019 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రూ.263.19 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేయడం ప్రారంభించింది. మిగిలిన రైతులకు ఎప్పుడు నిధులు అందుతాయన్న దానిపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందలేదు. ఆ సీజన్‌లో 2,23,248 మంది రైతులకు రూ.166.69 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. రూ.84.59 కోట్ల సాయం అందించాల్సి ఉంది. పాత బకాయిలను పెండింగ్‌లో ఉండగానే కొత్త సీజన్‌కు నిధులు విడుదల చేయడంపై రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి పూర్తి పెట్టుబడి సాయం అందుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన
తొలి విడతలో 2 ఎకరాలకే పరిమితమైన పెట్టుబడి సాయం
యాసంగి బకాయిలు పూర్తి కాకుండానే వానాకాలం నిధులు
మిగిలిన విస్తీర్ణంపై ‘భరోసా’ కరువు


