సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

Jul 1 2026 1:04 AM | Updated on Jul 1 2026 1:04 AM

మిడ్జిల్‌: మండలకేంద్రంలో ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ ఖుష్బూగుప్తా పరిశీలించారు. విగ్రహాల ఏర్పా టు స్థలం, బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా లోటు లేకుండా చూసుకోవాలని, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ నిరంతరం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని అన్నారు. సీఎం కాన్వాయికి, పబ్లిక్‌ మీటింగ్‌కు అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఆర్డీఓ నవీన్‌, డీఎస్పీ మహేష్‌కుమార్‌, సీఐలు నాగార్జున, మహేష్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా

30 పోలీస్‌ యాక్ట్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లావ్యాప్తంగా జూలై 31వ తేదీ వరకు 30(ఏ)పోలీస్‌ యాక్ట్‌–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్‌ అమల్లో ఉంటుందని, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేయరాదని సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

1,12,088 చిన్నారులకు పోలియో చుక్కలు

పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పాల్గొన్ని అర్హులైన చిన్నారులకు చుక్కల మందు వేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించారు. మూడు రోజుల్లో జిల్లాలో 0–5 ఏళ్లు నిండిన 1,12,088 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 2,02,123 ఇళ్లను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్‌ అధికారిని డాక్టర్‌ శైలజ పాల్గొన్నారు.

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌నకు గడువు పొడిగింపు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్ప్రింగ్‌ సీజన్‌–2026 కింద విదేశాలలో ఉన్నతవిద్య (పోస్ట్‌ గ్రాడ్యు యేట్‌/ పీహెచ్‌డీ) చదువుతున్న మైనారిటీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి ఎం.ఎ.ఖయ్యూం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండగా.. తాజాగా జూలై 15వ తేదీ వరకు పొడించామని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తుదారుల హార్డ్‌ కాపీతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జూలై 31వ తేదీలోగా తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ పథకం కింద ఎంపికయ్యే విద్యార్థులకు రూ.20 లక్షలతో పాటు రూ.60 వేలు వన్‌–వే విమాన చార్జీలు ఇస్తామని, ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనారిటీ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పాలిటెక్నిక్‌లో

స్పాట్‌ అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్లు ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆటోమోబైల్స్‌లో 8, సివిల్‌లో 8, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఇంజినీరింగ్‌లో 4, మెకానికల్‌లో 37 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. జూలై 4వ తేదీన కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని, ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,732

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో మంగళవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,732, కనిష్టంగా రూ.1,811 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,431, కనిష్టంగా రూ.2,071, కానుగ పలుకులు రూ.4,650 ధరలు పలికాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement