మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్– 12వ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జూలై 1నుంచి 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–12 కింద 18 ఏళ్ల లోపు చిన్నారులను బాలకార్మికులుగా గుర్తించి పని చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వారు పని చేస్తున్న ప్రాంతాలు గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడం, తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న యాజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అదే నేరాన్ని మళ్లీ చేసిన వారిపై అవసరం అయితే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తాత్కాలిక ప్రయోజనాల కోసం పిల్లలను పనులకు పంపించి వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేయవద్దని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు బలవంతంగా పని చేయిస్తున్నా, తప్పిపోయిన బాలబాలికలు కన్పిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణయ్య, ఆపరేషన్ ముస్కాన్ టీం ఎస్‌ఐ లెనిన్ పాల్గొన్నారు.


