● రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి
పాలమూరు: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు న్యాయాన్ని అందించడంలో అందరి నుంచి సమష్టి కృషి ఉండాలని రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి అన్నారు. జిల్లా కోర్టులో ఉన్న న్యాయసేవా అధికార సంస్థను పరిశీలించిన తర్వాత కోర్టు ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ పథకాలు, లైంగిక వేధింపుల చట్టం, డాన్ చట్టం, ఎల్‌ఎస్‌యూసీ చట్టాలతో పాటు లీగల్ ఎయిడ్ క్లినిక్‌లలో పనిచేస్తున్న పీఎల్వీలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు రాని పేదలకు చట్టాలపై అవగాహన పెంచాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొన్నారు. పేదలకు హక్కులను, బాధ్యతలను విస్తృతంగా తెలియజేయాలన్నారు. అందరూ న్యాయవాదులతో పాటు పీఎల్‌వీలు సమష్టిగా కృషి ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈనెల 18న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి డి.ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు పాల్గొన్నారు.


