వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

Jun 30 2026 2:53 AM | Updated on Jun 30 2026 2:53 AM

రాజాపూర్‌ (బాలానగర్‌): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం బాలానగర్‌ మండలంలోని కేతిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండేడ్‌ గ్రామానికి చెందిన మీసాల మల్లేష్‌ (35) స్థానిక పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అదే కంపెనీలో పనిచేసే భూపని మల్లేష్‌ అనే వ్యక్తి ఫోన్‌చేసి మల్లేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు భార్యకు సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా తీవ్రగాయాలై అప్పటికే మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి భార్య మీసాల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

వెంటిలేటర్‌ స్లాబ్‌ కూలి బాలుడికి గాయాలు

అమరచింత: పాఠశాలలో వెంటిలేటర్‌ స్లాబ్‌ కూలి పైన పడటంతో పవన్‌ కుమార్‌ అనే విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన అమరచింత పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమరచింత పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన పగడాకుల నరసింహా కుమారుడు పవన్‌ కుమార్‌ ఆదివారం సాయంత్రం అడుకునేందుకు పీఎంశ్రీ పాఠశాలలో గల మై దానంలోకి వెళ్లాడు.ఈ క్రమంలో అక్కడే ఉన్న పాత పాఠశాల భవనం పక్కన నిల్చోని ఉండగా వెంటిలేటర్‌కు సంబంధించిన స్లాబ్‌ ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో సబ్జా దిమ్మెలు పవన్‌ పై పడడంతో కుడికాలు విరగగా హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

యువకుడి ఆత్మహత్య

గండేడ్‌: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధి లోని కొంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆన మోని మాధవులు (32) సెంట్రింగ్‌ కూలీగా జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో 2015లో వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం రాంపూర్‌కు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్లుగా భార్య లక్ష్మి భర్త నుంచి విడిపోయి హైదరాబాద్‌లో ఉంటుంది. ఎంతకూ భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన మాధవులు ఆదివారం రాత్రి పొలం వద్ద ఉన్న గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

చనిపోయిన వ్యక్తి ఇంట్లో దొంగల చేతివాటం

తిమ్మాజిపేట: మహిళ చనిపోయి కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తూ శవాన్ని ఖననం చేసేందుకు వెళ్లగా మానవత్వం మరిచిన ఓ ఆగంతకుడు చేతివాటం ప్రదర్శించి దొంగతనానికి పాల్పడిన ఘటన తిమ్మాజిపేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆశమ్మ అనే మహిళ సోమవారం ఉదయం మరణించింది. బంధువులు వచ్చాక సాయంత్రం మృతదేహాన్ని తీసుకొని అంత్యక్రియలకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న దుండగుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారు కమ్మలు, బుట్టలు ఎత్తుకుపోయాడు. అంత్యక్రియలు ముగిశాక ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి వేసిన తాళంతో పాటు బీరువాకు వేసిన తాళం పగిలిపోయి ఉండడం చూసి అవాక్కయ్యారు. దాదాపు రూ.1.40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు చోరీ జరిగిందని తెలిపారు. చోరీ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement