జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్):డిండి లిఫ్టుకు పాల మూర్–రంగారెడ్డి నుంచి కాకుండా నాగార్జున సాగ ర్ గొట్టిముక్కల లిఫ్టు నుంచి నీరు తీసుకో వాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ నాయకుడు బెక్కం జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి అర టీఎంసీ నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. పార్టీలకతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఒత్తి డి తెచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేయాల ని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని కోరారు. 2013లో తెచ్చిన జీఓను అమలు చేస్తూ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ పనులను పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలన్నారు. గట్టు ఎత్తిపోతల, వెల్టూరు గొందిమల్ల బ్యారేజ్, కాకరవాణి, చంద్రసాగర్, అమ్రాబాద్ పనులు తక్షణమే చేపట్టాలని కోరారు. రాష్ట్ర వాటా నీరు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే వరకు గోదావరి–కావేరి అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాఘవచారీ, వీరబ్రహ్మచారీ, హనీఫ్ అహ్మద్, పరమేశ్‌గౌడ్, చెన్నకిష్టన్న, ఖలీల్, సాయిబాబ, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.


