● మన్యంకొండలో వైభవంగా
వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


