అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రంలో రహదారికి ఆనుకొని ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం.. అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి గిన్నె రాంచంద్రయ్య, భార్య కళావతి హైవే పక్కన సొంత ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్నారు. వారం క్రితం బంధువుల పెళ్లి కోసం కర్ణాటకలోని బళ్లారికి వెళ్లారు. కుమారుడు, కోడలితో కలిసి తిరుపతికి వెళ్లి ఆదివారం రాత్రి మూసాపేటకు తిరిగొచ్చారు. ఇంటి కిటికీకి ఉన్న ఇసుప గ్రిల్స్ విరగొట్టి ఉండడంతో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువా పగులగొట్టి చెవి కమ్మలను అలాగే దేవుడి గదిలో ఉన్న రెండు వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బంగారు, వెండి వస్తువుల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు రాంచంద్రయ్య తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం కళావతి సోదరి ఇంటికి వచ్చి శుభ్రం చేసి వెళ్లింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం రాత్రి చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
మూడేళ్ల కిందట ఇదే ఇంట్లో..
మూడేళ్ల కిందట ఇదే ఇంట్లో చోరీ జరిగింది. దంపతులిద్దరూ బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు దొంగలు చోరీకి పాల్పడి వెండి వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. పోతూపోతూ ఇంట్లో ఉన్న సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకెళ్లారు. ఈసారి దొంగలు వాటి జోలికి వెళ్లకుండా చోరీ చేసి పారిపోయారు. హైవే పక్కన ఒకే ఇల్లు ఉండటంతో వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు.


