ఇష్టారాజ్యంగా ‘ఫార్మా’ వ్యర్థాల పారబోత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాలు కాలుష్యమయంగా మారాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమ ల నుంచి ఘనరూప వ్యర్థాలను ఎక్కడి పడితే అక్కడ పారబోస్తున్నారు. చినుకు మాటున రసాయనాలతో కూడి విషపూరిత జలాలను నేరుగా బయటకు వదులుతున్నారు. అయినా అటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనలు పట్టని ఫ్యాక్టరీలపై కనీస చర్యలు సైతం చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనిచేయని ఎమ్మెల్యే హెచ్చరికలు?
పోలేపల్లి సెజ్ పరిధిలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పలు పర్యాయాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక సందర్భంలో ఓ పరిశ్రమను ప్రజలతో ముట్టడించి.. దగ్ధం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు. అసెంబ్లీ వేదికగా నిబంధనలు పట్టని పలు పరిశ్రమలు.. వాటి నిర్వాకంపై మాట్లాడారు. పీసీబీ పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ ప్రివిలేజి కమిటీకి ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు ఏ ఒక్క పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకెవరు చెబితే ‘అధికార’ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని సెజ్ పరిసరాల్లోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బరితెగించిన 2 పరిశ్రమలు..
సెజ్‌లోని కోహన్స్ లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమకు చెందిన సిబ్బంది సోమవారం ఘన వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల పక్కన పారబోశారు. గమనించిన రైతులు పరిశ్రమ ట్యాగులతో కూడిన ప్లాస్టిక్, గ్లౌజులు, ఇతర వ్యర్థాల ఫొటోలు తీసి.. హైదరాబాద్‌లోని పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆ ప్రాంతానికి ట్రాక్టర్‌ను, సిబ్బందిని పంపించి ఖాళీ చేసేందుకు యత్నించారు. అక్కడే ఉన్న రైతులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ప్రతిసారి చెబుతూనే ఉన్నా.. ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫ్యాక్టరీ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. కాగా, మరో ఫార్మా పరిశ్రమ నుంచి ట్యాంకర్ ద్వారా విషజలాలను సమీపంలోని ఓ ప్రాంతంలో గుంత తీసి వదిలిపెడుతున్నారు. ప్రధానంగా ఈ రెండు పరిశ్రమలు మరింత బరితెగించాయని.. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
ఓ పరిశ్రమ నుంచి గుంతలో వదిలిన కాలుష్యపు జలాలు
షరామామూలు..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో సుమారు 1,100 ఎకరాల్లో భూములు సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్‌కు 250 ఎకరాలు కేటాయించారు. ఇందులో 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడిన ద్రవ వ్యర్థాలను శుద్ధి చేశాకే బయటకు వదలాలి. ఘన వ్యర్థాలను నిర్దిష్ట ప్రాంతాలకు తరలించి రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలను ఏ ఒక్క పరిశ్రమ కూడా పట్టించుకోకవడం లేదు. ప్రధానంగా వర్షాకాలంలో వరద మాటున వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే పరిసర పంట పొలాల్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం వర్షాలు అంతగా లేకున్నా.. పలు పరిశ్రమల నిర్వాహకులు చినుకుల మాటున రాత్రిళ్లు దొంగచాటున రసాయనాలతో కూడిన నీటిని సరఫరా చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల్లో వాడిన గ్లౌజులు, ప్లాస్టిక్, సిరంజి వంటి వ్యర్థాలను సెజ్‌లోని ఖాళీ ప్రదేశాలు, పొలాల్లో ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. ఫలితంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సెజ్ సమీప ప్రాంతాల్లోని భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి.
చినుకు మాటున బయటకుశుద్ధి చేయని జలాల సరఫరా
సరిగ్గా పండని పంటలు.. మూగజీవాల మృత్యువాత
షరామామూలుగా పట్టించుకోని పీసీబీ, జిల్లా అధికారులు
నిబంధనలు పట్టని ఫ్యాక్టరీలపై కానరాని కనీస చర్యలు
అరణ్యరోదనగా ‘పోలేపల్లి’ పరిసర రైతుల ఆవేదన


