సహకార్‌ సే సమృద్ధి వారోత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సహకార్‌ సే సమృద్ధి వారోత్సవాలకు శ్రీకారం

Jun 30 2026 2:47 AM | Updated on Jun 30 2026 2:47 AM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): సహకార రంగం బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సహకార్‌ సే సమృద్ధి కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సహకార వారోత్సవాలు సోమవారం మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఆడిటోరియంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి కృష్ణ సహకార ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓ)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎఫ్‌పీఓల పరిధిలో 2,290 మంది రైతులకు సభ్యత్వం కల్పించి రూ.34.89 లక్షల వాటా ధనాన్ని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులు ఈ వాటా ధనంతో వివిధ రకాల వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా సమాన వాటా ధనాన్ని ఆయా సంఘాలకు అందించిందన్నారు. సహకార ఆడిట్‌ అధికారి టైటస్‌ పాల్‌ పవర్‌, డీసీసీబీ జనరల్‌ మేనేజర్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

డీఎఫ్‌ఓగా

మందాడి నవీన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: జిల్లా అటవీశాఖ అధికారి ఆశిష్‌సింగ్‌ రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారిగా పని చేస్తున్న మందాడి నవీన్‌ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఏప్రిల్‌ 29న జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యత తీసుకున్నఆశిష్‌సింగ్‌ రెండు నెలల్లోనే బదిలీపై వెళ్లడం గమనార్హం.

ఓపెన్‌ స్కూల్స్‌

అడ్మిషన్లు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ శివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాలతో చదువులకు దూరమైన విద్యార్థులు ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్లు పొందవచ్చని, ఆన్‌లైన్‌ విధానంలో వచ్చేనెల 29వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, జరిమానాతో ఆగస్టు 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని వివరించారు.

7 నుంచి

స్వయం ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో జూలై 7 తేదీ నుంచి 21వ బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి జె.రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెట్‌ తయారీ, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు (ఎంఎస్‌ ఆఫీస్‌), రిఫ్రిజిరేషన్‌, ఏసీ, మొబైల్‌ సర్వీసింగ్‌, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. మూడు నెలల శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌ సెట్విన్‌ వారిచే సర్టిఫికెట్‌ ఇస్తారని, ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 7వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో జతచేయాలని కోరారు. మిగతా వివరాలకు కేంద్రం ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి 9440788502 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

పీయూలో

కొనసాగుతున్న పరీక్షలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో బీపెడ్‌ మొదటి సెమిస్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ 8వ సెమిస్టర్‌, బీఫార్మసీ 6 సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈమేరకు పరీక్షలను కంట్రోలర్‌ ప్రవీణ, పీయూ ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్‌లకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement