జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేబీఎల్ హరిప్రియతో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి సమస్యలను తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు ప్రజల సమస్యలను ఓర్పుగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం లేని సమస్యలైతే అందుకు గల కారణాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన ఫైళ్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, ప్రతి కార్యాలయంలో ఫైళ్ల కదలిక నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు. జూలై 1న నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో పోలీసు, వైద్య, పౌర సరఫరాలు, హౌసింగ్, మున్సిపల్, విద్యుత్, ఉపాధి, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా.. ఈ వారం ప్రజావాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డుల శాఖ, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 137 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్‌ఓ నిర్మల, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు పాల్గొన్నారు.
అనవసరంగా పెండింగ్‌లో పెట్టొద్దు.. గడువు లోగా పూర్తి చేయండి
ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూగుప్తా
ఈ వారం ప్రజల నుంచి 137 వినతుల స్వీకరణ


