సిబ్బందికి సూచనలు ఇచ్చాం
ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. ప్రజలకు ఫారం ఇవ్వటమే కాక వాటిని నింపడంలో బీఎల్వోలు సహకరిస్తారు. ఫారంను పూర్తిగా చదివిన తర్వాతే దానిని నింపడం చేయాలి. తప్పులు లేకుండా నింపడం ద్వారా ఓటర్ కార్డులో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఉంటాయి.
–మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
జెడ్పీ సెంటర్(మహబూబ్‌నగర్)/కల్వకుర్తి టౌన్: ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఉండే ఎన్యూమరేషన్ ఫారం అందజేస్తారు. సరైన సమా చారం అందిస్తేనే మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. ఈ ఫారం ఎలా నింపాలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఫారాన్ని ఎలా నింపాలో అధికారులు సూచిస్తున్నారు.
ఎన్యుమారేషన్ ఫారం ఇలా..
ఓటర్ జాబితాను ధృవీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించేందుకు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకునేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఈ ఫారంలో వివరాలు నింపేటప్పుడు తప్పులు లేకుండా స్పష్టంగా రాయాలి.
ఫారంలో పొందపరిచిన విభాగాలు
01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే..
2002 ఓటర్ జాబితా వివరాల ఆధారంగా ఈ కాలాన్ని నింపాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, సంరక్షకుడి పేరు, అతనితో మీకు ఉన్న బంధుత్వం వివరాలను నింపాలి. 2002 ఓటర్ జాబితాలో గల శాసనసభ నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ స్టేషను నెంబరు (భాగం సంఖ్య), క్రమ సంఖ్య ( ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబరు) ఎంత అనేది వేయాలి.
01–01–2002 నాటికి ఓటు లేకపోతే..
మీకు ఓటు లేదు.. 2002 ఓటర్ జాబితాలో మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరికో ఓటు ఉందో వారి వివరాల ప్రకారం ఈ బాక్స్ పూరించాలి. పేరు అనే చోట తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మ లలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ వేయాలి. బంధువు అనే చోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నెంబర్ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కానీ మీ బంధువుల్లో ఓటు ఉన్న వారి వివరాలు ఈ బాక్సులో నింపాలి.
ఫారం పై భాగం..
మీ పేరు, మీ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫోటోతో ముందుగా ము ద్రించి ఉంటాయి. అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫోటో తప్పనిసరిగా అతికించాలి.
మొదటి భాగంలో..
2002లో ఓటు ఉన్న వారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేని వారికోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాలలో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకొని నింపాలి.
మరో భాగం..
చివరి భాగంలో ఓటరు ప్రస్తుత వివరాలను నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి వాటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు వారి ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి కాకుంటే ఆ బాక్సులు ఖాళీగా వదిలేయాలి.
ఓటర్లు అందించాల్సిన పత్రాలు
ఆధార్ కార్డు, జనన ధవీకరణ పత్రం, పాస్ పోర్ట్, 10వ తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన వివరాల అందించడం వల్ల భవిష్యత్తులో ఓటర్ కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.
ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పులు లేకుండా నింపాలి
ఫామ్ అందజేసిన తర్వాత రశీదు తప్పనిసరి
ఓటర్లు చేయాల్సిన చేయకూడని నిబంధనలు వివరించిన అధికారులు
ఫారంలో కొత్త కలర్ ఫొటో అతికించాలి


