ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

కందనూలు: వానాకాలంలో విత్తనాలు పొలంలో వేసి వర్షాలు పడక తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రక్షించేందుకు పాలకులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని కోరారు. రైతులు వినియోగించే ఎరువులు, విత్తనాలు, యూరియా ధరలను విచ్చలవిడిగా పెంచేసి విక్రయిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఏడాది లోపు రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, పంట కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి నెల రోజులు కావస్తున్నా.. పనులు పురోగతి మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 36 లక్షల సాగు భూమి ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండగా.. నల్లగొండ జిల్లాలో 17 లక్షల ఆయకట్టు ఉండగా 14.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. యథేచ్ఛగా డిండికి నీరు తరలిస్తున్నా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వల సామర్థ్యం కుదింపునకు ప్రస్తుత మంత్రి జూపల్లి కారణమని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడం మానుకొని రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్‌, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement