‘విద్యాహక్కు’ను పకడ్బందీగా అమలుచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘విద్యాహక్కు’ను పకడ్బందీగా అమలుచేయాలి

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

మెట్టుగడ్డ: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీసీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సమాజ్‌, బీసీ టైమ్స్‌ ఆధ్వర్యంలో విద్యాహక్కు చట్టం అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో తొంభై శాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, విద్యార్థులు మేలుకుంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చన్నారు. అదే విధంగా బీసీ సమాజ్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌సాగర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో పాత పద్ధతిని అవలంబించాలని కొత్త జీఓను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పథకాన్ని పూర్తిగా నీరు గార్చే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మంచిదని లేని పక్షంలో బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. విద్యాహక్కు చట్టానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ సమాజ్‌ గౌరవ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, బీసీ జేఏసీ కన్వీనర్‌ బెకెం జనార్థన్‌, జుర్రు నారాయణయాదవ్‌, బుగ్గన్న, సారంగి లక్ష్మీకాంత్‌, అశ్విని సత్యం, మున్నూర్‌ జైపాల్‌, చెన్నయ్య, విద్యార్థి సంఘాల నాయకులు నరసింహ, భరత్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement