మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఒకే భాష, సంస్కృతి కలిగిన ఎస్టీలు రిజర్వేషన్లతో అన్ని రంగాల్లో లబ్ధి పొందుతున్నారని మహబూబాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ అన్నారు. ఆదివారం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ రిజర్వేషన్లు కల్పించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. ఆమె 1976లో తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు లంబాడీలు, ఆదివాసీలు ఎందరో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. రాజకీయంగా ఎస్టీ నాయకులకు వివిధ పదవులు దక్కాయన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సామాజిక న్యాయం దక్కిందన్నారు. ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తున్న ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా ఎస్టీలకు సబ్–ప్లాన్, పోడు భూములకు హక్కులు కల్పించారని, రైతు భరోసా, రుణమాఫీ, బీమా తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. వచ్చే సెప్టెంబర్ 18 నాటికి బస్సు యాత్ర పూర్తవుతుందని, చివరిరోజు హైదరాబాద్‌లో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ మైసిగండి నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో పూర్తయిందన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జటోత్ రాంచందర్‌నాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత తదితరులు పాల్గొన్నారు.


