కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్‌కు చెందిన బి.అజిత్‌రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్‌రెడ్డి వద్ద స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(ఎఫ్‌ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్‌రెడ్డి 2012 సివిల్ సర్వీస్‌కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్‌రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది.
ఆహారం నాణ్యత
పరిశీలించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వివాహ, శుభ కార్యాలు, విందులు, సామూహి క భోజనాల అనంతరం మిగిలిపోయిన ఆహారాన్ని స్వీకరించే ముందు దాని నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఓ ప్రకటనలో సూచించారు. పెళ్లిళ్లు, వేడుకలు, ఇతర కార్యక్రమాల అనంతరం మిగిలిన ఆహారాన్ని కొందరు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సేవా సంస్థలు అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆహారం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఆహారం తయారైన సమయం, నిల్వ చేసిన విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, రవాణా పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పంపిణీ చేసి వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలాంటి ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆస్పత్రిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
నిలకడగా ఫుడ్ పాయిజన్ బాధితుల ఆరోగ్యం
పాలమూరు: కలుషితమైన స్వీట్ తినడం వల్ల వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో పాటు మ హిళలను డీఎంహెచ్‌వో పరిశీలించారు. మోతీనగర్‌లో 25న జరిగిన పెళ్లి వేడుకలో తయారు చేసిన కద్దు కీ ఖీర్ స్వీట్ మరసటి రోజు మధ్యాహ్నం తర్వాత తినడం వల్లే 41 మందికి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనా లు అయినట్లు తెలిపారు. వారందరూ రాత్రి జనరల్ ఆస్పత్రిలో చేరారని, ఇందులో 26 మంది చిన్నారులు, ఒక గర్భిణితో పాటు మరో 14 మంది మహిళలు, పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జి అవుతారని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికాంత్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
పెంచుకోవాలి
పాలమూరు: గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జమిస్తాపూర్‌లో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలెవరూ చట్టాలను చేతుల్లోకి తీసుకోవద్దని, చట్ట పరిధిలో నడుచుకోవాలన్నారు. క్షణికావేశంలో గొడవలకు పోతే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని తెలుసుకోవాలని సూచించారు. వర్షకాలం సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే వాటిని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీంద్ర నాయక్, యోగేశ్వర రాజ్, మల్లారెడ్డి, శివరాజ్, సర్పంచ్ లక్ష్మీ మొగులయ్య, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


