● ‘ఎడ్యుకేషన్–కరప్షన్’ కథనానికి స్పందించినఉన్నతాధికారులు
● వెంటనే విచారణ చేపట్టాలని డీఈఓకు ఆదేశాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల విషయంలో పలు అక్రమాలు జరిగాయని పేర్కొంటూ ‘సాక్షి’దినపత్రికలో మే 19న ప్రచురితమైన ఎడ్యుకేషన్–కరప్షన్ కథనానికి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు కథనానికి స్పందిస్తూ మహబూబ్‌నగర్ డీఈఓ విజయకుమారికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్ ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. దీన్ని అర్జెంట్ ఎంక్వయిరీగా భావించి త్వరగా విచారణ చేయాలని ఆదేశించారు. అయితే గత నెల 23వ తేదీనే ఆర్డేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా.. జూన్ 27వ తేదీ వరకు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందన లేదు. విచారణ జరగకపోయినప్పటికీ అధికారులకు వచ్చిన లెటర్‌ను సంబంధిత సెక్షన్ అధికారులు దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో విచారణ చేయాల్సిందిగా మరోసారి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా మండల ఎంఈఓ కార్యాలయంలో జరుగుతున్న విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఎంఈఓపై విచారణ చేయాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, విచారణ చేసి వీలైనంత త్వరగా నివేదిక పంపిస్తామని ఆమె పేర్కొన్నారు.


