మహబూబ్‌నగర్ క్రైం: చెక్కులు దొంగతనం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని పట్టణ శివారు ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన సిద్ధేష్ కొన్ని రోజుల నుంచి బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మోసం చేస్తూ చెక్కులు మాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 1న మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ వద్ద మహ్మద్ అసదుల్లా అనే వృద్ధుడు విత్‌డ్రా కోసం చెక్కు రాస్తున్న క్రమంలో సహాయం చేస్తానని నమ్మించాడు. అనంతరం బాధితుడికి తెలియకుండా చెక్‌బుక్‌లోని సంతకం చేసిన ఒక చెక్కును అపహరించాడు. వారం రోజుల తర్వాత అనంతపురం జిల్లా రాంగనర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన మరో వ్యక్తిని నమ్మించి అతని వద్ద రూ.90 వేలు తీసుకొని దొంగతనం చేసిన చెక్కును సదరు వ్యక్తి ఖాతాలో జమ చేశాడు. 2025లో ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌బీఐ క్లాక్‌టవర్ బ్రాంచ్‌లో ఒక వృద్ధుడి వద్ద చెక్కు అపహరించి రూ.50వేలు డ్రా చేసినట్లు తెలిపారు. సదరు నేరస్తుడు సిద్ధేష్‌పై తెలంగాణ, ఏపీలో కలిపి 16 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ శేఖర్, కా నిస్టేబుళ్లు శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


