రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

ఉమ్మడి జిల్లాలో 11 తహసీల్‌ కార్యాలయాలకు మహర్దశ

గద్వాల ఆర్డీఓ కార్యాలయానికి సైతం నిధుల కేటాయింపు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శిథిలావస్థలోఉన్న తహసీల్దార్‌ కార్యాలయాలు, డివిజన్‌ రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్డీఓ, 107 తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక ఆర్‌డీఓ, 11 తహసీల్దార్‌ కార్యాలయాలకు మహర్దశ రానుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రతి భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు చొప్పున నిధులు కేటాయించనున్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో లేదా శిథిలావస్థలో పని చేస్తున్న కార్యాలయాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పనుల అమలు బాధ్యతను తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజాపూర్‌, మహమ్మదాబాద్‌, కౌకుంట్ల, కోయిల్‌కొండ తహసీల్దార్‌ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు గద్వాలలో ఆర్డీఓ కార్యాలయానికి నిధులు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్‌, రేవల్లి, చిన్నంబావి, వీపనగండ్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కోడేరు తహసీల్‌ కార్యాయాలకు మహర్దశ రానుంది. కొత్త భవనాల నిర్మాణంతో రెవెన్యూ సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కలగడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement