సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం
● పీహెచ్‌సీలలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
● అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేస్తాం
● మెడికల్ ఆఫీసర్ల సమయపాలనపై ప్రత్యేక డైరీ
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు
పాలమూరు: వర్షకాలం మొదలైన క్రమంలో సీజనల్ వ్యాధుల కట్టడికి అన్ని విభాగాల ప్రోగ్రామ్ అధికారులతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో జిల్లా ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌ఓ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.. ‘‘గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం ఆరోగ్య శాఖను చక్కదిద్దడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మొదట ఒక్కో పీహెచ్‌సీని పరిశీలన చేసి సమస్యలపై అధ్యయన చేస్తున్నా. అక్కడ నిర్వహణ లోపాలపై సమగ్రంగా ఒక నివేదిక తయారు చేస్తున్నాం. జిల్లాలో పీహెచ్‌సీలు, కమ్యూనీటీ హెల్త్‌సెంటర్‌లలో వైద్యసేవలను గాడిలో పెట్టడానికి ఇప్పటికే మెడికల్ ఆఫీసర్ల దగ్గరి నుంచి ఇతర సిబ్బంది వరకు అందరితో వేరువేరుగా సమావేశాలు నిర్వహించాను. ప్రతి పీహెచ్‌సీలో కావాల్సిన మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు. వారు సమయపాలన పాటించడానికి ఒక ప్రత్యేక డైరీ విధానం అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే రోజుల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తాం. జిల్లాలో గతే ఏడాది 336 డెంగీ పాజిటివ్ వచ్చాయి.జిల్లావ్యాప్తంగా 23 హైరిస్క్ గ్రామాలతో పాటు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 33 హైరిస్క్ డివిజన్లను గుర్తించాం. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో లీకేజీలకు మరమ్మతులు చేయించి..పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెడుతాం. ప్రధానంగా యాంటీ లార్వా ఆపరేషన్, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తాం. ప్రతి ఆశా కార్యకర్తకు 180 నుంచి 200 ఇళ్లు కేటాయించాం. వారి పరిధిలో ఉన్న ఇళ్లలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ట్యాంకులు, టైర్లు, పూలకుండీలలో వర్షం నీరు, ఇతర నీళ్లు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి.’’
సాధారణ ప్రసవాలు అయ్యేలా
జిల్లావ్యాప్తంగా ఉన్న 17 పీహెచ్‌సీలు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలలో సాధారణ ప్రసవాలు పెంచడానికి ప్రతి నెలా 50 ప్రసవాలు అయ్యే విధంగా చూస్తాం. పీహెచ్‌సీలలో వందశాతం స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరిని మెడికల్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తుండాలి. సాధారణ కాన్పులు చేయడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటే పీహెచ్‌సీలో చేయాలి. ఉమ్మ నీరు సక్రమంగా కచ్చితంగా సెక్షన్ చేయాలనే కేసులను మాత్రమే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలి. అలాగే హైరిస్క్ కేసులు రెఫర్ చేసిన తర్వాత ఎందుకు చేశారో అనేది తప్పక వివరాలు నివేదించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు చేసుకోవాలనే అవగాహన గర్భిణీలతో పాటు భర్తలు, వారి కుటుంబసభ్యులకు రావాల్సిన అవసరం ఉంది.


