మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటిని బీఎల్‌ఓలు సందర్శించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వారి వివరాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.
సర్‌లో ప్రతి ఓటరు నమోదు కావాలి
దేవరకద్ర: సర్‌లో ప్రతి ఓటరు నమోదు కావాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలో సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మృతిచెందిన వారిని, శాశ్వతంగా వలస పోయినవారిని గుర్తించి విచారణ జరిపి తొలగించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులను సర్‌లో ఓటరుగా నమోదు చేయించాలని కోరారు.
పీసీసీ పార్లమెంట్
కో–ఆర్డినేటర్ల నియామకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్‌కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు.
వీబీజీ రామ్‌జీపై పోరుకు సిద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న కొత్త విధానం వల్ల ఉపాధి హామీ కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రెండు పూటల ఫొటో విధానం కూలీలకు ఇబ్బందికరంగా మారిందని, దాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే ఉపాధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే చర్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మహాసభల పిలుపు మేరకు జూలై 1న ఉపాధి కూలీలు పనులు బహిష్కరించి పెద్దఎత్తున గ్రామపంచాయతీల ఎదుట నిరసనల్లో పాల్గొనాలని కోరారు. అనంతరం ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, జిల్లా ప్రజలు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.


