జడ్చర్ల: మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ జానకి సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జడ్చర్లలో వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ జడ్చర్ల పరిసర ప్రాంతాలలో గల పరిశ్రమలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో కొందరు గంజాయిని ఆయా రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని అన్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రధానంగా యువత ఇలాంటి మత్తు పదార్థాల బారిన పడవద్దన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా వేసి ఉంచాలని, పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాలను ఎప్పటికప్పడు పరిశీలిస్తుండాలన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్న డ్రగ్స్ వాడకం నివారణపై చైతన్యం కలిగి ఉండాలన్నారు. చెడు అలవాట్లు ఒకరికే పరిమితం కావని, వారి స్నేహితులకు కూడా అలవాట్లుగా మారుతాయన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్‌శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడం, విక్రయించడం వంటి సమాచారాన్ని తమకు అందించి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.


