జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ అనుకూల ఓట్లు పోకుండా చూస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్య ఓటర్లలో ఈ ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యులు, రోజు వారీ కూలీలకు ‘ఫారం–2’ నింపడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అవగాహన లోపం వల్ల వేలాది మంది అర్హులైన సామాన్యులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముసాయిదా జాబి తా ప్రచురణ తర్వాత పాత జాబితాతో అనుసంధానం కాని వారికి ఓటరు నమోదు అధికారి (ఈఆర్‌ఓ) నోటీసులు జారీ చేస్తారు. అయితే, ముసాయిదా జాబితాలో పేరున్న వ్యక్తిపై విచారణ జరపకుండా, వారికి న్యాయ సమ్మతమైన అవకాశం ఇవ్వకుండా పేరును తొలగించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
● ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సవరణ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈనెల 25 నుంచి బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ప్రతి ఇంటికీ తిరిగి గణన ప్రక్రియ ప్రారంభించారు. కాగా.. ఓటరుజాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఓటర్లంతా విధిగా ‘మ్యాపింగ్’ పూర్తి చేసుకోవాలి. జిల్లాలో మొత్తం 7,32,488 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 77.28 శాతం (5,66,055 మంది) మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 1,66,433 మంది మ్యాపింగ్ కావాల్సి ఉంది. జిల్లాలో పురుషులు 3,61,863, మహిళలు 370600 మంది, 25 మంది ఇతరులు ఉన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 2,64,235 మంది ఓటర్లు ఉండగా.. 1,80,388 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారు. ఇంకా 83,847 మ్యాపింగ్ చేయాల్సి ఉంది. జడ్చర్లలో 2,23,911 మంది ఓటర్లలో 1,83,443 ఓటర్ల మ్యాపింగ్ కాగా.. 42,468 మ్యాపింగ్ చేయాల్సి ఉంది. దేవరకద్రలో 2,42,342 మంది ఓటర్ల ఉండగా 2,02,224 ఓటర్లు మ్యాపింగ్ చేయగా 40,118 మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉంది. వీరంతా తక్షణమే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవడంతో పాటు ఫారం పూర్తి చేసి ఇవ్వాలి. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తుంది. దీని కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా అ ధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్య వేక్షించారు. రంగారెడ్డి గూడ పర్యటనలో ఉన్న కలెక్టర్ ఖుష్బుగుప్తా ‘సర్’ ప్రక్రియకు సంబంధించి బీఎల్‌ఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బల్సుపల్లి, నా గారం గ్రామాల్లో, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్ బీ హరిప్రియ జడ్చర్ల పురపాలికలో, ఆర్‌డీఓ నవీన్ జిల్లాకేంద్రంలోని కిద్వాయిపేటలో పర్యటించి ఎ న్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లకు ఫారాలు ఎలా నింపాలో వివరించాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు సై తం గ్రామాల్లో పర్యటించి ప్రక్రియను పర్యవేక్షించా రు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చిన్నచింతకుంట మండలం దమగ్నాపురంలో బీఎల్‌ఓలకు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. అలాగే రంగారెడ్డిగూడలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఎన్యూమరేషన్ ఫారం నింపి బీఎల్‌ఓకు అందజేశారు.
ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్‌పత్రాలిస్తున్న బీఎల్‌ఓలు
బూత్ లెవల్ ఏజెంట్లను నియమించిన రాజకీయ పార్టీలు
తొలిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన యంత్రాంగం
జిల్లాలో మ్యాపింగ్ చేయాల్సిన ఓటర్లు 1,66,433


