జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించడంతో పాటు ప్రజల ఆకాంక్షలను, సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. యాక్షన్ ప్లాన్‌లోలో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం చేసినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా గుర్తించిన ప్రజల సమస్యలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలు, పరిష్కారం చేసిన వాటి వివరాలు, పెండింగ్‌లో ఉన్న వాటి పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించి ప్రణాళిక, ఆర్థిక అవసరాల అంచనా వేయాలన్నారు. నిధులతో సంబంధం లేనివి తక్షణం పరిష్కరించాలన్నారు. గ్రామపంచాయతీ భవనాలు లేని చోట ఈజీఎస్ కింద మంజూరు చేసి వచ్చే 9 నెలల్లో భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను నిర్మాణం చేయాలని డీఆర్‌డీఓకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణ తగు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్‌తో కార్పొరేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. జాతీయ రహదారులుపై ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లు గుర్తించి ఆయా ప్రాంతాలతో పాటు దాబాలు ఉన్న చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్ఫూర్తిని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని సూచించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమం కాదని, నిరంతర కార్యక్రమం అని, సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, ట్రెయినీ కలెక్టర్ సాయశివాని, డీఆర్‌ఓ నిర్మల, సీపీఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్


