గద్వాల క్రైం: ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకంపై జిల్లా కేంద్రంలోని ఓ బాధితుడు వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గత గురువారం ఉదయం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడికి ట్యాంక్ దిగాడు. అయితే బాధితుడు మరోసారి గురువారం ఇదే తీరును ప్రదర్శించాడు. బాధితుడి కథనం మేరకు.. నరేష్‌చారి కుటుంబ వ్యవహారంలో ఏఆర్ కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నాడు. పోలీసులు న్యాయం చేస్తామని చెప్పినా ఫలితం లేదని వాపోయాడు. భార్య కాపురానికి రాకుండా బెంగళూర్‌లో ఉందన్నారు. దీంతో మనస్థాపం చెంది జిల్లా ప్రభుత్వాస్పత్రి వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి బలవన్మరణం చేసుకునేందుకు యత్నించగా.. అప్పట్లో గద్వాల సీఐ శ్రీను ఘటనా స్థలానికి చేరుకొని, ఏఆర్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నేటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. దీంతో బాధితుడు అధికారుల తీరుపై నమ్మకం లేదని వాపోయాడు. సీఐ అక్కడికి చేరుకొని కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు క్షేమంగా కిందకు వచ్చాడు. ఈ ఘటనతో ఆస్పత్రి పరిసరాల్లో రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది.
60 ట్రిప్పుల ఫిల్టర్ ఇసుక సీజ్
గోపాల్‌పేట: రేవల్లి మండలంలోని కేశంపేట చింతలచెరువు నుంచి మట్టిని తీసి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారని గురువారం సోషల్ మీడియాలో వీడియోలు, ఆడియోలు హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం మధ్యాహ్నం కేశంపేట చింతలచెరువును సందర్శించారు. చెరువులో నుంచి బయటకు తీసిపోసిన సుమారు 60 ట్రాక్టర్ల మెత్తటి మట్టిని సిబ్బందితో కలిసి సీజ్ చేశామని రేవల్లి తహసీల్దార్ సరస్వతి తెలిపారు. పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు నివేదిస్తామని, ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వివరించారు. ఇదిలా ఉండగా అక్కడ మట్టి మాత్రమే లేదని, ఫిల్టర్ చేసిన ఇసుక కూడా ఉందని అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించి.. ఫిల్టర్ ఇసుకను కూడా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.


