ప్రభుత్వ ఆస్పత్రిలో నీళ్ల కొరత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో నీళ్ల కొరత

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

ఇబ్బందులు పడుతున్న రోగులు,

అటెండర్లు

జడ్చర్ల టౌన్‌: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నీళ్ల కొరతతో రెండు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు వినియోగించేందుకు కూడా నీరు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎక్కడికి వెళ్లాలో తెలియక తంటాలు పడ్డారు. ఆస్పత్రిలో బోరు మోటర్‌ ద్వారా సంప్‌లను నింపి, అక్కడ నుంచి భవనం పైన ట్యాంక్‌లను నింపి, వాష్‌రూంలకు, నల్లాలకు సరఫరా చేస్తారు. వీటితో పాటు మిషన్‌ భగీరథ నీరు సైతం సంప్‌లో నిల్వ అవుతుంటాయి. నెల రోజులుగా మిషన్‌భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవటంతో బోరు మోటార్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉన్న బోరు మోటార్‌ కూడా మరమ్మతుకు నోచుకోవడంతో నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ నీళ్లు అయిపోయిన విషయాన్ని ఎలక్ట్రీషియన్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న రెండో బోరు ఆన్‌ చేసి సంప్‌లోకి నీటిని పంపించారు. రెండో బోరులో నీటి లభ్యత తక్కువగా వస్తుండటంతో అవి రోగుల అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. మంగళవారం రాత్రి, బుధవారం, గురువారం రోగులు, వారి వెంట ఉన్న అటెండర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరత కారణంగా పురుషుల వార్డులో నీళ్లు లేక ఓ టాయిలెట్‌కు ఏకంగా తాళం వేశారు. దీంతో రోగులు బాటిళ్లు పట్టుకుని ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చింది. పాడైన మోటార్‌ బుధవారం మరమ్మతుకు పంపించి గురువారం సాయంత్రానికి తిరిగి ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement