పత్తికి బదులు సోయాబిన్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తికి బదులు సోయాబిన్‌

Jun 25 2026 1:36 AM | Updated on Jun 25 2026 1:36 AM

తక్కువ పెట్టుబడి...ఎక్కువ లాభాలు

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి

అలంపూర్‌: వానాకాలం పంట సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వానాకాలం పంట ప్రారంభం కావడంతో అధికారులు ఏ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చో అవగాహన క ల్పిస్తున్నారు. మూసపద్ధతికి స్వస్తి పలకాలని పంట మార్పిడి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలలకు పత్తి సాగుకు ప్రత్యామ్నాయంగా సోయాబిన్‌ పంటను సాగు చేసుకోవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. కందిలో సహాయ పంటగా, పండ్ల తోటలో అంతర్‌ పంటగాను సోయాబిన్‌ సాగు చేసుకోవచ్చని వివరించారు. పంట సాగు యాజమాన్య పద్ధతులతో పాటు అంశాలను వివరించారు.

నేలలు: మురుగు నీరు పోయే వసతి ఉండి, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి.

రకాలు: జేఎస్‌–335, ఎల్‌ఎస్‌బీ–1, పీకే–472 ఇందులో జేఎస్‌ 335 రకం ప్రసిద్ది చెందింది.

పంటకాలం: సోయాబిన్‌ పంట కాలం 100 నుంచి 110 రోజులు

పంట వేసే పద్ధతి: సోయాను పత్తిలో, కందిలో అంతర్‌, మిశ్రమ పంటగా వేయవచ్చును. వానాకాలంలో సోయా సాగు తర్వత రబీలో శనగ, మినుములు వేసుకోవచ్చు.

విత్తనం: విత్తనం ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరం. విత్తనాన్ని 45 ఇంటూ 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకు వరసలోని మొక్కల మధ్య 3 సెంటిమీటర్ల లోతులో మెత్తటి దుక్కిలో నాటు వేసుకోవాలి.

విత్తే కాలం: జూన్‌ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తడానికి అనుకూలం

కలుపు నివారణ:

సోయాలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి 250 మి.లీ ఇమాజిత్‌ పైర్‌ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని కలుపును నివారించుకోవాలి.

ఎరువులు:

ఎకరానికి 25 కిలోల యూరియా, 150 కేజీల సూపర్‌, 25 కిలోల పోటాష్‌ అవసరం. విత్తేటప్పుడు ఫోరేట్‌ 10 జీ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడితే కాండపు ఈగలాంటి పురుగును నివారించుకోవచ్చు.

పంట కోత:

ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి, రాలిపోవడం మొదలైనప్పుడు లేదా కాయలు ఆకుపచ్చ నుంచి బూడిద రంగులోకి మారినప్పుడు కోయాలి. కోత ఆలస్యం అయితే కాయలు చిట్లి గింజలు రాలిపోతాయి. పంట కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆరనిచ్చి గింజలోని తేమ శాతం 14 వరకు చూసి నూర్పిడి చేయాలి.

దిగుబడి: సోయా సాగుకు ఎకరానికి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement