తెలకపల్లి: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ బాలశంకర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు.. మండల కేంద్రంలో ఈ నెల 23 రాత్రి 9గంటల సమయంలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు బ్లూకోర్టు కానిస్టేబుల్ బాలకృష్ణ, శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని గొడవ పరిష్కరించారు. తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చే క్రమంలో గ్రామానికి చెందిన మోకురాల రాజేష్‌గౌడ్ అనే వ్యక్తి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతూ వారి విధులకు ఆటంకం కలిగించాడు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదు మేరకు రాజేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
మహమ్మదాబాద్: మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతు కొమ్మూరి చిన్నయ్య(54) బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై నడుచుకుంటూ పాత పెట్రోల్‌బంక్ సమీపంలోని సర్వీస్‌రోడ్డు వద్దకు రాగానే, వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన చిన్నయ్యను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని జింకలపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేశ్(24) గతవారం జాతీయ రహదారిపై ధర్మవరం స్టేజీలో జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కర్నూలు జిల్లాలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
రాజోళి: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోకారి తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఖలీల్(30)కు ఇటిక్యాల మండలం ఉదండాపురానికి చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఖలీల్ మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గత రెండేళ్ల క్రితం భార్య భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనస్థాపం చెందిన ఖలీల్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రఫి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


