గండేడ్‌ కేజీబీవీ ఎస్‌ఓకు షోకాజ్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

గండేడ్‌ కేజీబీవీ ఎస్‌ఓకు షోకాజ్‌ నోటీస్‌

Jun 25 2026 1:36 AM | Updated on Jun 25 2026 1:36 AM

విధులకు గైర్హాజరుపై కలెక్టర్‌ ఆగ్రహం

నోటీసులు జారీ చేయాలని

డీఈఓకు ఆదేశాలు

గండేడ్‌: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ ఖుష్భూగుప్తా షోకాజ్‌ నోటీసుల జారీకి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, పీహెచ్‌సీని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా కేజీబీవీకి చేరుకున్న కలెక్టర్‌ హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎస్‌ఓ శివలీల పాఠశాలకు రాలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు పొందలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విధులకు సకాలంలో హాజరవ్వాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని తేల్చిచెప్పారు. కొందరు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా వరండాలో ఉండడంతో గమనించిన కలెక్టర్‌ తరగతులోకి వెళ్లాలని సూచించారు. వసతులను పరిశీలించారు. వంటగది, స్టోర్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌ అంసతృప్తి వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలు అందించడంపై ఆరా తీశారు. విద్యార్థినులకు అలాంటివి ఎలా పెడతారని సిబ్బంది, ఉపాధ్యాయులను ప్రశ్నిచారు. విద్యార్థినులకు ఇచ్చే పండ్లు గురువారం సరిపోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాభోదన, కల్పిస్తున్న సదుపాయాలపై ఆరాతీశారు. అలాగే కాంట్రాక్టర్‌తో మాట్లాడి కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్‌

గండేడ్‌ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న ఓపీ వివరాలను మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మల్లికార్జున్‌రావు, ఎంఈఓ జనార్దన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement