పాన్‌గల్: పాత ధాన్యం తరలిస్తున్నారనే అనుమానంపై ధాన్యం లారీని పోలీసులు సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ కార్తీక్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి తన మీనాక్షి రైస్ మిల్లులో సీజ్ చేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున ఎస్‌ఐ కుర్మయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ బీపీ ప్రసాద్‌తో కలిసి మిల్లుకు వెళ్లి ధాన్యం లోడ్‌తో ఉన్న లారీని సీజ్ చేశారు. అనంతరం లారీలో లోడ్ చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల టెక్నికల్ అధికారులు నిర్ధారణ కోసం శాంపిల్ తీసుకెళ్లారని, నిర్ధారణ చేసిన తర్వాత లారీల్ లోడ్ చేసిన ధాన్యం పాతదా, కొత్తదా అనే విషయాలు తెలుస్తాయన్నారు. తాను పండించిన ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు ఇచ్చిన టోకెన్ ఆధారంగా విక్రయించేందుకు తీసుకెళ్తుంటే అధికారులు సీజ్ చేశారని ఓ రైతు పేర్కొన్నాడు.


