డ్రగ్స్‌ నిర్మూలనకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలనకు పటిష్ట చర్యలు

Jun 25 2026 1:30 AM | Updated on Jun 25 2026 1:30 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నార్కొటిక్‌ కోఆర్డినేషన్‌ జిల్లా కమిటీ సమావేశంలో ఎస్పీ జానకితో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్‌, విద్య, జిల్లా సంక్షేమ, వైద్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ – వికసిత్‌ భారత్‌కి పహచాన్‌’ థీమ్‌తో ఈ నెల 17 నుంచి 26 వరకు జిల్లాలో మత్తు పదార్థాల నివారణపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలనపై 22 నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీస్‌ శాఖ ఒక్కటే కాకుండా.. మిగతా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా సమన్వయంతో పనిచేస్తేనే మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గురువారం నగరంలోని మెయిన్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ చౌక్‌ వరకు ఉదయం 9.30 గంటలకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం తెలిపారు.

● జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, రోడ్డు భద్రతా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ జానకితో కలిసి సమీక్షించారు. ఆయా సమావేశాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈఓ విజయకుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ సంధ్య, పీఆర్‌ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్డు భద్రత నిపుణులు, ట్రాఫిక్‌ పోలీసు, ఎకై ్సజ్‌, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక లభ్యత, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అలాగే హరితహారం, మొక్కల పెంపకం కార్యక్రమాలపై సమీక్షిస్తూ.. మండలాలు, గ్రామాల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. రోడ్ల పక్కన చెత్త వేయకుండా, గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డుల్లోనే చెత్తను పారవేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్‌, డీఆర్‌డీఓ నర్సింహులు, హౌజింగ్‌ పీడీ ఉపేందర్‌రెడ్డి, పీఆర్‌ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement