విద్యతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

Jun 25 2026 1:30 AM | Updated on Jun 25 2026 1:30 AM

నారాయణపేట రూరల్‌: సంపూర్ణ విద్యతోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధ్యపడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్‌ ప్రారంభించారు. అలాగే ధన్వాడలో ఎస్సీ విద్యార్థుల వసతిగృహాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న సింగిల్‌విండో గోదాం విద్యార్థులకు అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్‌ నారాయణపేటకు తరలించడం నిలిపివేయాలని.. ఇక్కడే అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం కిష్టాపూర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పి ంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోటకొండ పాఠశాల జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న పీఎం శ్రీ పాఠశాలగా.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను పొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

నేడు విద్యుత్‌

సరఫరాలో అంతరాయం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): నగరంలోని 11 కేవీ టీడీగుట్ట ఫీడర్‌ పరిధిలోని చెట్ల కత్తిరింపు కారణంగా గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏడీ థావుర్యానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మోటార్‌ లైన్‌, శ్రీనివాస్‌ టాకీస్‌, మదీనా మసీదు, రామమందిర్‌ చౌరస్తా, రామయ్యబౌలి, వీటీగోల్డ్‌ పాన్‌చౌరస్తా, గాంధీనగర్‌, బండ్లగేరి, కుర్హినిశెట్టి కాలనీ, గణేష్‌నగర్‌, హోండా షోరూం, జములమ్మనగర్‌, హనుమాన్‌పుర, బండమీదిపల్లి చౌరస్తా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామన్నారు.

యువత డ్రగ్స్‌కు

ఆకర్షితులు కావొద్దు

పాలమూరు: విద్యార్థులు, యువత తాత్కాలిక ఆనందం వైపు కాకుండా భవిష్యత్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి అడుగులు వేయాలని, విద్యార్థి దశలో ఉన్నవారు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నా రు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. డ్రగ్స్‌ వల్ల జీవన విధానం పూర్తిగా మారుతుందని, దీంతో భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారుతుందన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడి కోసం పోలీస్‌ శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి కూడా బాధ్యతగా ఉంటూ గంజాయి, పొగాకు వంటి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు.

పీజీ ఫలితాలు విడుదల

పాలమూరు: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్‌లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్‌సైట్‌ను చూడాలని కంట్రోలర్‌ ప్రవీణ పేర్కొన్నారు.

ఓపెన్‌ డిగ్రీ, పీజీ ప్రవేశాలు..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ సత్యనారాయణగౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పీజీలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు వివిధ లాంగ్వేజెస్‌లో చేరే అవకాశం ఉందని, విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement