ప్రతిరోజూ ఇబ్బందులే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ ఇబ్బందులే..

Jun 25 2026 1:30 AM | Updated on Jun 25 2026 1:30 AM

నేను ఉద్యోగరీత్యా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటాను. ఉదయం కొత్త బస్టాండులో మహమ్మదాబాద్‌కు వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫాం వద్ద కొద్దిసేపు వేచి చూస్తుంటాను. ఇక్కడి ప్రాంగణమంతా దుర్గంధభరితమైన వాసన వస్తుండటంతో ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సాయంత్రం తిరిగి బస్సు దిగిన సమయంలోనూ అదే పరిస్థితి. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి.

– మంజుల, సుభాష్‌నగర్‌, మహబూబ్‌నగర్‌

అపరిశుభ్ర వాతావరణమే..

నేను ఓ ప్రైవేట్‌ మార్కెటింగ్‌ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్‌ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

– నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్‌నగర్‌

శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

కొత్త బస్టాండులో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం లోపలికి వెళితే చాలు ఎక్కడ చూసినా దుర్గంధమే కనిపిస్తుంది. ఆవరణలోని కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌కు వెనుక ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లు తొలగిస్తే బాగుంటుంది. ముఖ్యంగా హోటల్‌, క్యాంటీన్‌ నుంచి వచ్చే వ్యర్థ జలాలు కాల్వ ద్వారా బయటకు సరిగా వెళ్లడం లేదు. వెంటనే ఆర్టీసీ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలి.

– జగపతిరావు, అధ్యక్షుడు, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం, మహబూబ్‌నగర్‌

శుభ్రం చేయిస్తున్నాం..

ర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్‌ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్‌కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్‌కుమార్‌, డీఎం, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement