మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ విధుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సమర్థతతో విధులు నిర్వహించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించారు. పోలీస్ శాఖలో ఉన్న అతి కీలకమైన పలు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. శాసీ్త్రయ ఆధారాల సేకరణలో సంఘటన స్థల పరిశీలన, సాక్ష్యాధారాల పరిరక్షణ వంటి అంశాల్లో సిబ్బంది ప్రతిభను పరీక్షించారు. అదేవిధంగా అనుమానాస్పద వస్తువులను గుర్తించడం, భద్రత తనిఖీల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై పోటీలు సాగాయి. అలాగే డాగ్ స్క్వాడ్ పోటీలలో ట్రాకింగ్ సామర్థ్యం, అనుమానితులను గుర్తించే ప్రతిభపై ప్రదర్శన నిర్వహించారు. కంప్యూటర్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డేటా నిర్వహణపై సిబ్బంది వారి నైపుణ్యాలు ప్రదర్శించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానం, అప్రమత్తత, సమర్థతత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి డ్యూటీ మీట్‌లలో సిబ్బంది నైపుణ్యాలు మరింత మెరుగుపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, సీఐ రామకృష్ణ, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్ పాల్గొన్నారు.
నేరస్తులపై నిఘా పెరగాలి
స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులతోపాటు రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ జానకి అన్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆమె తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. స్టేషన్‌లో నమో దవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిఘా కొనసాగించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పర్యవేక్షణ పెంచాలన్నారు. ఆ తర్వాత సిబ్బందితో మాట్లాడుతూ శాఖపరమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


