పీయూ సిబ్బందికి యాప్‌లో అటెండెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

పీయూ సిబ్బందికి యాప్‌లో అటెండెన్స్‌

Jun 24 2026 1:23 AM | Updated on Jun 24 2026 1:23 AM

ఈనెల 26 వరకు యాప్‌లో

పేరు నమోదుకు సూచన

లొకేషన్‌ ఆధారంగా రోజూ

ఫొటోతో ఫోన్‌లో హాజరు

మీ ప్రమాణం పేరుతో ప్రత్యేక యాప్‌

జూలై 1వ తేదీ నుంచి

యాప్‌ ద్వారా ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందికి అటెండెన్స్‌ ఆన్‌లైన్‌లోనే వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ప్రత్యేక యాప్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మీ ప్రథమం’ యాప్‌లో సిబ్బంది తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇటీవల అధికారులు సర్క్యూలర్‌ జారీ చేశారు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీతోపాటు పీజీ కళాశాల, ఫార్మసీ, ఎంఈడీ, లా, ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేషన్‌, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌, హాస్టల్స్‌కు సంబంధించిన సిబ్బంది బయోమెట్రిక్‌ అటెండెన్స్‌తోపాటు, రిజిస్ట్రర్‌లో కూడా సంతకాలు పెడుతున్నారు. అయితే గతనెల పలువురు సిబ్బందికి వేతనాల్లో కోత విధించారని, బయోమెట్రిక్‌ అటెండన్స్‌ పనిచేయకపోయిన సిబ్బందిని బాధ్యులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్‌ తీసుకొచ్చారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒకేసారి అందరూ సిబ్బంది బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలంటే నిరీక్షించే పరిస్థితి నుంచి ఈ యాప్‌ ద్వారా అంటెండెన్స్‌ ఉపశమనం కలిగించనున్నట్లు పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు.

350 మంది సిబ్బంది

పీయూలో మొత్తం 350 నాన్‌టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తుండగా.. సుమారు 120 మందికిపైగా టీచింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఈనెల 26లోగా మీ ప్రథమం యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ అటెండెన్స్‌ వల్ల బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ స్థానంలో ఇప్పుడు యాప్‌లో అటెండెన్స్‌ వేయాల్సి ఉంది. పీయూలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళల్లో నేరుగా యాప్‌లో ఫేసియల్‌ రెకగ్నైజేషన్‌ విధానంలో ఫొటో తీసుకోవాల్సి ఉంది. ఇక వేతనం కోసం ఇటూ యాప్‌ అటెండెన్స్‌, రిజిస్టర్‌ అటెండెన్స్‌ను అధికారులు పరిగణలోనికి తీసుకోనున్నారు. అయితే కొంతమంది నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే తప్పకుండా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ యాప్‌ ద్వారా సుమారు 75శాతం సిబ్బంది పేర్లును నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement