జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రెండో విడుతలో ముందుగా గుడిసెలున్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను కేటాయించారు. గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకే కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో గుడిసెలు, ప్లాస్టిక్ కవర్ల కింద నివాసముంటున్న నిరుపేదలను గుర్తించే పనిలో క్షేత్రస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. గృహ నిర్మాణశాఖ అధికారులు స్వయంగా వెళ్లి అర్హులను గుర్తించి వారితో ఇందిరమ్మ ఇంటి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున వంద నియోజక వర్గాలకు రెండు లక్షల గృహాలను మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. మరో 50 వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటాగా నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల గృహాలు మంజూరయ్యాయి.
నియోజకవర్గానికి రెండు వేలు
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం 2వేల ఇళ్లను రెండో విడుతలో మంజూరు చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లబ్ధిదారుల జాబితాలోని అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా అధికారులు గుర్తిస్తారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గుడిసెవాసులకు కేటాయించే 500 ఇళ్లు పోగా మిగతా 1,500 ఇళ్లలో 40 శాతం ఇళ్లను కోటాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ లెక్కన 1,500 ఇళ్లల్లో సుమారు 600 ఇళ్లు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల కోటాగా ఉంటుంది. మన జిల్లాల్లో ఒక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా లేడు. ఉన్న మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని ఈసారి కూడా తప్పనిసరి చేశారు.
రెండో విడుతకు ఎదురుచూపులేనా?
ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాల్లో అర్హుల జా బితా ఇవ్వగా.. మొదటి విడుతలో అందరికీ ఇవ్వ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దాదాపు ఆరునెలలుగా రెండో విడుత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిర మ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండో విడుతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడుతను ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని జాబితాలు వస్తాయని భావించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటనలే గాని ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
ఇప్పటిదాక 1,841 గుడిసెల లెక్క
జిల్లాలో ఇప్పటిదాక 1,831 గుడిసెల లెక్క తేలింది. మరో రెండు మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. దీంతో పూర్తి లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 10,266 ఇళ్లు మంజుయ్యాయి. ఇందులో ఇప్పటి దాక 1,825 ఇళ్లు పూర్తయ్యాయి. 7,103 వివిధ దశల్లో ఉండగా.. బేస్‌మెంట్ స్థాయిలో 1,445, గోడల దశలో 660 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి దాక 3,173 ఇళ్లు చెత్తు పూర్తయ్యాయి. ఇప్పటి దాక మొత్తం రూ.190కోట్ల బిల్లులను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది.
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
గుడిసెలు లేనితెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడుతలో ముందుగా గుడిసెలున్న వారికి ప్రాధాన్యం ఇస్తాం. గుడిసెల లెక్క తేలిన అనంతరం మిగిలిన ఇళ్లను వేరే కేటగిరీ వారికి కేటాయిస్తాం.
– ఉపేందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ
రెండో విడుత ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం
గుడిసెల సర్వేలో పంచాయతీకార్యదర్శుల నిమగ్నం
ఇప్పటిదాక జిల్లాలో తేలినగుడిసెల లెక్క 1,831


