జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు సీఎం ప్రజాపాలన–ప్రగతిపాలన 99 రోజుల కార్యక్రమం ప్రారంభించినట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని అనంత మారుతీ గార్డెన్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్‌లకు అధికారంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి కృషి చేసి.. వారికి నమ్మకం కల్పించాలని సూచించారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించి వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ప్రజారోగ్యం, పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టా సారించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించడం, స్థానిక పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమస్యలు ఎదురైతే జిల్లా పరిపాలన విభాగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వామ్యులై సహకారం అందించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఐదు దశల్లో 10 ప్రాధాన్యత అంశాలతో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఈ ప్రణాళికలో అందరం భాగ్యస్వాములై విజయవంతం చేద్దామన్నారు.
● రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా అమలు చేస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ జి.మమత మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు తమ పరిపాలన సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశమన్నారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, ఆర్‌డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నరసింహారెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాల్కోటి, దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ దమయంతి, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలి
ప్రజాసమస్యలు పరిష్కరించి నమ్మకం కలిగించాలి
కలెక్టర్ ఖుష్బూ గుప్తా


